Sunday, March 29, 2015

అసలు క్రికెటంటేనే ఓ కిరికిరి ఆట
*******************************
అసలు క్రికెటంటేనే ఓ కిరికిరి ఆట. ప్రతి మనిషికీ చెందిన ప్రతి సెకనుకూ ఓ ‘ఆర్థిక విలువ’ ఉందనుకుంటే, ఇన్ని కోట్ల మంది రికాముగా కూర్చుని క్రికెట్‌ చూడడం వల్లే, వారికి చెందాల్సిన డబ్బంతా టీవీలు, కంపెనీలు, ఆటగాళ్ల ఖాతాల్లో జమవుతోంది. మన పిచ్చిని కనిపెట్టే, మార్కెటింగ్‌ మాయగాళ్లు మారుమారు ఫార్మాట్లలో మనమీద ఆటను రుద్దేస్తున్నారు. ఆదమరిచి ఉండగా అడ్వర్టైజ్‌మెంట్లతో కొల్లగొడుతున్నారు. దేశం నెత్తిన జెల్లగొడుతున్నారు. ఐదు రోజుల ఫార్ములా, ఒకరోజు (50 ఓవర్ల) ఫార్ములా. 20 ఓవర్ల ఫార్ములా.. వీడియో గేమ్‌ ఫార్ములా.. ఆండ్రాయిడ్‌ ఫార్ములా! క్రికెట్‌.. వికెట్‌.. టికెట్‌.. ఆట పెట్టేయ్‌, సొమ్ములు కొట్టేయ్‌.. అసలు ఫార్ములా ఇదీ. ఫుట్‌బాల్‌, షటిల్‌, టెన్నిస్‌.. ప్రపంచంలో ఇంకే పాపులర్‌ ఆటనైనా తీసుకోండి. క్రికెటంత టైమ్‌ వేస్ట్‌ కాదు. పైకి చెప్పరు కానీ, క్రికెట్‌ మ్యాచ్‌ ఉందంటే చాలు.. భయపడి చచ్చేంత భయం. ఉద్యోగులకు ఎక్కడ ‘సామూహిక మోషన్స్‌’ పట్టుకుంటాయోనని కంపెనీలకు భయం. సినిమాలు విడుదల చేయాలంటే బయ్యర్లకు భయం. పరీక్షల టైంలో మ్యాచ్‌లు వస్తాయేమోనని తల్లిదండ్రుల భయం. ఆరోజు పెట్రోలు అమ్ముడు పోదని బంకుల భయం. ప్రొడక్టవిటీ తగ్గిపోతుందని ఫ్యాక్టరీల భయం. ప్రధాని నుంచి పాకీ పనివాడిదాకా అందరి ధ్యాసా క్రికెట్‌పైనే! మర్రి చెట్టులా దేశమంతటా ఊడలు దిగిన క్రికెట్‌ మరే ఆటా పైకెదగకుండా చేస్తోంది. ఉన్నమాటంటే ఉలుకెందుకన్నట్టు ఈ సంగతి చెప్పినందుకే, రాంగోపాల్‌ వర్మ విలన్‌ క్యారెక్టర్‌ అయిపోయాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీల్లో ఒకటైన ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ షిప్‌లో రెండో స్థానంలో నిలిచిన సైనా నెహ్వాల్‌ స్వదేశానికి వస్తే స్వాగతం కూడా చెప్పలేనంత క్రికెట్‌ బిజీలో దేశం ఉండిపోయింది. అర్థంకాని సంగతేమిటంటే... చిన్నా పెద్దా కలిపి 202 దేశాలున్న ఈ విశాల ప్రపంచంలో కేవలం 14 దేశాలు మాత్రమే ఆడే క్రికెట్‌లో గెలిస్తే విశ్వ విజేత అనడం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో అర్హత పోటీల్లో హోరాహోరీ సమరం తర్వాత 32 జట్లు తలపడి తాడోపేడో తేల్చుకునే సాకర్‌లోనూ ఇంత మార్కెటింగ్‌ మాయామర్మం లేదు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా మీరు వరల్డ్‌కప్‌ని కోల్పోయారు కదా అంటే.. ధోనీ ఓ వెర్రినవ్వు నవ్వి కప్‌ను ఎవరూ తీసుకోలేరు, ఎవరూ పోగొట్టుకోలేరు అని చమత్కరించాడు. ఎందుకంటే అసలు వరల్డ్‌కప్‌ క్రికెట్‌లో గెలిచినవారికి ఇచ్చేది అసలు కప్‌ కాదు, డూప్‌! అది మరో మాయ!!
చివరాఖరు : టీవీ అనే గ్రౌండ్‌లో మార్కెటింగ్‌ అనే బాల్‌తో అడ్వర్టైజ్‌మెంట్‌ అనే బౌన్సర్‌ విసిరి, వినియోగదారుడనే బ్యాట్స్‌మన్‌ని హిట్‌వికెట్‌ చేసి, రివ్యూకు కూడా చాన్స్‌ లేకుండా నాకౌట్‌ దశలోనే డకౌట్‌ చేసి షాపుకు పంపే అసలైన ఆటే క్రికెట్‌... అట!!